కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణ చర్యలు

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణ చర్యలు

Share with
Views : 22

దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా పక్కాగా అమలుచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు.

తాజాగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్.జవహర్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ సీఈవో మీనాతో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. అన్ని శాఖల కార్యదర్శలు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు సీఎస్. ముఖ్యంగా ప్రభుత్వ వెబ్ సైట్లు అన్నింటిలో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలు, ఆడియో, వీడియోలు వంటివి వెంటనే తొలగించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకూ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా ప్రతినిధులకు సంబంధించిన పొటోలను, ఫ్లెక్సీలను తొలగించాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులపై గల రాజకీయపరమైన ప్రకటనలన్నీ తొలగించాలని సీఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

కోడ్ ఉల్లంఘన ఫిర్యాదులపై తక్షణ చర్యలు

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై ఏశాఖ పైనైనా ఫిర్యాదులు వస్తే సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి కార్యదర్శులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటే అలాంటి వారిపై విచారణ జరిపి ఎన్నికల నిబంధనల ప్రకారం కఠిన చర్యల తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అధికారులు అందరూ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కార్యదర్శి స్థాయి అధికారులు ఎన్నికల పరిశీలకులుగా వెళ్ళనున్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై పూర్తి స్పష్టత ఉండేలా మార్గదర్శకాలను పూర్తిగా చదివి అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి సీఈవో ఇచ్చే ప్రత్యేక ఫార్మాట్‌లో నివేదిక ఇవ్వాలని అన్ని శాఖల కార్యదర్శులను జవహర్ రెడ్డి ఆదేశించారు.

ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చాక కొత్త పధకాలు ప్రకటించడానికి వీలులేదని సీఈవో మీనా స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రావిజన్ ఉన్నప్పటికీ నూతన ప్రాజెక్టులు, పథకాలు, రాయితీలు, గ్రాంట్లు మంజూరు, హామీలు, శంఖుస్థాపనలు పూర్తి నిషేధమని తెలిపారు. వర్క్ ఆర్డర్ ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు మొదలు కాని పనులు చేపట్టకూడదని తెలిపారు. పనులు పూర్తయిన వాటికి నిధులు విడుదలలో ఎలాంటి నిషేధం లేదని స్పష్టం చేశారు. పెన్షన్ల పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పారు. కోడ్ అమలులోకి వచ్చాక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వివిధ రిజిష్టర్డ్ లబ్దిదారులకు యదావిధిగా ఉపాధి పనులు కల్పించవచ్చని చెప్పారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రాకముందు ఏవైనా పనులకు సంబంధించి టెండర్లు పిలిచి ఉంటే ఆ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని, టెండర్లను ఖరారు చేయడానికి వీలులేదని మీనా కార్యదర్శులకు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన 24 గంటల్లోగా ప్రభుత్వ ఆస్తులపై అన్ని రకాల వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులు, బ్యానర్లు, జెండాలు వంటివన్నీ తొలగించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రైల్వే, రోడ్డు వంతెనలు, ప్రభుత్వ బస్సులు, విద్యుత్ స్తంభాలు, మున్సిపల్ సమావేశ ప్రదేశాల్లోని అన్ని రకాల రాజకీయ పరమైన అడ్వర్టైజ్‌మెంట్లు, వాల్ రైటింగులు, పోస్టర్లు, కటౌట్లు వంటి వన్నిటినీ షెడ్యూల్ వెలువడిన 48గంటల్లో తొలగించాలని మీనా ఆదేశాలు జారీ చేశారు.

ఎన్నికల ప్రకటన వచ్చాక మంత్రులెవరూ అధికారిక వాహనాలను ఎన్నికల ప్రచారం కోసం వినియోగించరాదని స్పష్టం చేశారు. ఎంపీ లేదా ఎంఎల్ఏ నిధులు లేక ఇతర ప్రభుత్వ పధకాల నిధులతో నిర్వహించే వాటర్ ట్యాంకులు, అంబులెన్సులు వంటి వాటిపై ఎంపీ, ఎమ్మెల్యేల వంటి ప్రజా ప్రతినిధుల ఫొటోలు ఉండరాదని సీఈవో మీనా స్పష్టం చేశారు.ఎన్నికల ప్రకటన వచ్చాక ప్రభుత్వ భవనాలు,కార్యాలయిల్లో ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహా మంత్రుల ఫొటోలు ఉండరాదని తెలిపారు.

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చాక విద్యుత్, నీటి బిల్లులు, బోర్డింగ్ పాసులు, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ప్రజా ప్రతినిధుల ఫొటోలు,సందేశాలు వంటివి ఉండరాదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అలాగే పీఎం, సీఎం సహాయ నిధి కింద గుండె, కిడ్ని, కేన్సర్ వంటి రోగులకు అత్యవసర చికిత్సలకై సకాలంలో నిధులు మంజూరుకు ఆయా శాఖలకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఏ రాజకీయ పార్టీకైనా అనుకూలంగా వ్యవహరించినా లేదా ఆయా పార్టీలు నిర్వహించే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా, గిఫ్టులు, ఇతర లబ్ది పొందినా అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले