160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు: చంద్రబాబు

160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు: చంద్రబాబు

Share with
Views : 35
*రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా మూడు పార్టీల పొత్తు* *సీట్లు త్యాగం చేసిన వారిని నేనెప్పుడూ మర్చిపోను* *నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలన్నదే ప్రయత్నం* *160 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాల్లో కూటమిదే గెలుపు* *160 నియోజకవర్గాల్లో త్వరలో ఎన్నికల ప్రచారం* *ఫేక్ పోస్టులతో జగన్ రెడ్డి నీచ రాజకీయం* *ఏపీని డ్రగ్స్ కు అడ్డాగా మార్చారు* *కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల వర్క్ షాప్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు* *అమరావతి :-* రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాజకీయ ప్రయోజనమో, వ్యక్తిగత ప్రయోజనమో కాకుండా రాష్రాభివృద్ధి కోసమే మూడు పార్టీలు కలిసి వెళ్తున్నాయని పేర్కొన్నారు. కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ లో శనివారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....‘‘పొత్తులో భాగంగా మనమంతా భేషజాలు లేకుండా జట్టుగా ముందుకు నడవాలి. ఈ ఎన్నికల్లో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రౌడీయిజం, అధికార దుర్వినియోగం ఎక్కువైంది. అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. పొత్తులోని మూడు పార్టీలలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశ్యంతో వ్యతిరేక ఓటు చీలకుండా పొత్తు అంశంలో పవన్ కళ్యాణ్ ముందుకొచ్చారు. పవన్ కళ్యాణ్ పద్ధతైన వ్యక్తి. జనసేన కార్యకర్తలు కూడా పవన్ కల్యాణ్ నాయకత్వంలో నిబద్ధతతో పనిచేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుండి నేను అభ్యర్థుల ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నా. టీడీపీకి ఒక విశ్వసనీయత ఉంది. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. *సీట్లు త్యాగం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోను* పొత్తులో భాగంగా అందరికీ టికెట్లు ఇవ్వలేకపోయాం. ఈ ఐదేళ్లలో ఎంతో పోరాడి జైళ్లకు కూడా వెళ్లారు. కానీ రాష్ట్రం గెలవాలి...ప్రజలకు న్యాయం జరగాలని అనుకున్నప్పుడు కొన్ని త్యాగాలు తప్పలేదు. విశాఖ సౌత్ నియోజకవర్గం నుండి గండి బాబ్జీ, అనకాపల్లి నుండి పీలా గోవింద్, పిఠాపురం నుండి వర్మ, నిడదవోలు నుండి శేషారావు, ఉంగుటూరు నుండి గన్ని వీరాంజనేయులు, తెనాలి నుండి ఆలపాటి రాజా, తిరుపతి నుండి సుగుణమ్మ పాతపట్నం నుండి రమణ, శ్రీకాకుళం నుండి లక్ష్మీదేవి, మైలవరం నుండి దేవినేని ఉమామహేశ్వరరావు, పెదకూరపాడు నుండి శ్రీధర్...ఇలా దాదాపు 31 మంది ముఖ్యనేతలకు మనం సీట్లు ఇవ్వలేకపోయాం. జనసేనదీ అదే పరిస్థితి. దీనర్థం వారు కష్టపడలేదని కాదు. కష్టపడ్డారు...కానీ రాష్ట్రం కోసం, ప్రజల కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. సీట్లు త్యాగం చేసిన వారిని ఎప్పుడూ మర్చిపోను. *నిలబెట్టిన ప్రతి అభ్యర్థీ గెలవాలి* ఈసారి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను మూడు పార్టీల నేతలం కలిసి చర్చించాం. అభ్యర్థుల ఎంపికలో నిద్రలేని రాత్రులు కూడా గడిపాం. మూడు పార్టీలదీ ఒకటే ఆలోచన...నిలబెట్టిన ప్రతి అభ్యర్థి గెలవాలి. ప్రజలతో ఓటు వేయించుకునే శక్తి, ధీటుగా పోరాడే వ్యక్తులు ఉండాలి. ఎన్డీయేకు లోక్ సత్తా కూడా మనకు మద్ధతు తెలిపింది. అన్ని వర్గాలను అధ్యయనం చేసి అభ్యర్థులను ఎంపిక చేశాం. రాజకీయాల్లో కొత్తగా పొలిటికల్ రీ ఇంజనీరింగ్ చేయాల్సి వస్తోంది. ప్రజల ఆమోదం లేకుండా బలహీనమైన అభ్యర్థులు ఉంటే మిగిలిన సీట్లపై ఆ ప్రభావం పడుతుంది. అందుకే సోషల్ రీ ఇంజనీరింగ్ తో వెతికి అభ్యర్థులకు సీట్లిచ్చి గెలిపించుకోబోతున్నాం. జీవితంలో డబ్బు సంపాదిస్తారు..కోరుకున్న రంగాల్లో రాణిస్తారు. రాజకీయాల ద్వారా సమాజాన్ని ప్రభావితం చేయడంతో పాటు గుర్తింపు కూడా వస్తుందని నేటితరం ఆలోచిస్తోంది. రాజకీయాలను ప్రక్షాళన చేస్తే సమర్థులు రాజకీయాల్లోకి వస్తారు. సమాజాన్ని మార్చే శక్తి పబ్లిక్ పాలసీలకు ఉంటుంది. తెలుగు వారు ప్రపంచమంతా రాణిస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు బాగాలేవు. మన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరినీ మళ్లీమళ్లీ అడిగి సమాచారం తీసుకున్నా. రాగద్వేషాలకు అతీతంగా ఎంపిక చేశాను. ప్రజల్లో అభ్యర్థులపై ఏ అభిప్రాయం ఉందో తెలుసుకున్నా. ఇందుకోసం టెక్నాలజీని కూడా వాడాను. నియోజకవర్గ పరిశీలకులు చెప్పింది విన్నాను...క్షేత్ర స్థాయిలో వాస్తవాలను కూడా పరిగణలోకి తీసుకున్నా. *రాష్ట్ర భవిష్యత్తుకు వేసే పునాదితో 30 ఏళ్లు ఎదురుండదు* రాష్ట్ర భవిష్యత్ కు ఈ మూడు పార్టీలు వేసే పునాదితో 30 ఏళ్లు ఎదురులేకుండా ఉండాలి. ఎడ్లబండ్ల నుంచి డ్రైవర్ లెస్ కార్ల దాకా వచ్చాం. కరెంటు లేని స్థితి నుంచి సోలార్ ఉత్పత్తి వరకూ వచ్చాం. భావితరాల భవిష్యత్ కు, రాష్ట్ర ప్రగతికి మనం కట్టుబడి పనిచేయాలి. దేశానికి ఎన్డీయే ఉపయోగపడినట్టే రాష్ట్రాన్ని బాగుచేసేందుకు టీడీపీ కంకణం కట్టుకుంది. పేదరికం లేని రాష్ట్రంగా ఏపీని తయారుచేస్తాం. వైసీపీ లాంటి పార్టీని కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ పెట్టాలి. వచ్చే పదేళ్లలో మొత్తం డిజిటల్ కరెన్సీ వస్తుంది. నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. జగన్ రెడ్డి లాంటి వ్యక్తి ఉంటాడు...ఇలాంటి రాజకీయాలు చేస్తాడని జీవితంలో ఊహించలేదు. రాజకీయాలను వ్యాపారం చేశాడు. జగన్ కు విలువలు, పద్ధతులు లేవు. ఏమీ లేకుండా అనునిత్యం అబద్ధాలు చెప్తూ బతికేస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పడం మామూలు విషయం కాదు. తప్పు చేశావ్ అని చెప్తే వారిపైనే పోలీసులను పంపి తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. కేసులు వాదించేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. *ఫేక్ పోస్టులతో జగన్ నీచ రాజకీయం* బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి పురంధేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు తప్పుడు వార్తలు సృష్టించారు. బీజేపీ, టీడీపీ పొత్తు తాత్కాలికం...పోలవరం, అమరావతి పూర్తయ్యాక పొత్తు ఉండదు అని నా పేరుతో తప్పుడు నోట్ వదిలేశారు. పురందేశ్వరి మా కుటుంబసభ్యురాలే కానీ ఆమె 30 ఏళ్లుగా వేరే పార్టీలో ఉన్నారు. ఒకే కుటుంబంలోని వారు వేరే వేరే పార్టీల్లో ఉండటం సహజం. దాన్నీ రాద్ధాంతం చేస్తున్నారు. జనసేనతో సీట్ల పైనా అంతే తప్పుడు సమాచారాన్ని తిప్పారు. పొత్తులో పలానా వారికి అన్యాయం జరిగిందని ఫేక్ పోస్టులు పెట్టారు. *ఏపీని జగన్ డ్రగ్స్ కు అడ్డాగా మార్చారు* విశాఖలో ఇటీవల డ్రగ్స్ పట్టుకున్నారు. 25 వేల కేజీల డ్రగ్స్ రాష్ట్రానికి బ్రెజిల్ నుండి వచ్చాయి. ఆఫ్ఝనిస్తాన్ నుంచి కూడా డ్రగ్స్ వచ్చాయి. ఏపీలో డ్రగ్స్ విపరీతంగా ఉంది. గతంలో మేము పోరాడితే పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. దాడులను నిరసిస్తూ నేను రెండు రోజులు దీక్ష చేశాను..ఫిర్యాదు చేసినా డీజీపీ పట్టించుకోలేదు.నిందితులపై చర్యలు తీసుకోకుండా మనవాళ్లపైనే కేసులు పెట్టారు. ఈ ఐదేళ్లలో గంజాయి, డ్రగ్స్ పై ముఖ్యమంత్రి సమీక్ష కూడా చేయలేదు. ముంద్రా పోర్టులో గతంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి...ఇందులో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రమేయముందని చెప్పినా ఇంతవరకూ ఆ కేసు ఏమైందో తెలీదు. నీకు జవాబుదారీతనం లేదా జగన్ రెడ్డి? నిన్న విశాఖ డ్రగ్స్ పట్టుబట్టిన దాంట్లో వాళ్ల పార్టీ వ్యక్తే ఉన్నాడు...కానీ తిరిగి మనపై రాళ్లు వేస్తున్నారు. బ్రెజిల్ ప్రెసిడెంట్ కు శుభాకాంక్షలు చెబుతూ విజయసాయి ట్వీట్ చేశాడు...బ్రెజిల్ ప్రెసిడెంట్ తో వీరికి సంబంధం ఉంది. వీళ్లు ఇంటర్నేషనల్ మాఫియా. నాకు, పురందేశ్వరికి పూర్ణచంద్రరావు బంధువు అని విజయసాయిరెడ్డి స్టేట్ మెంట్ ఇస్తున్నాడు. ఈ ఐదేళ్లలో డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించిన మిమ్మల్ని ఏమనాలి? మీ నాయకులతో చేయించి మాపై నేరం మోపుతారా? ఏపీలో వచ్చే డబ్బు విదేశాలకు హవాలా రూపంలో తరలించేశారు. కూనం వీరభద్రరావు...వైసీపీ నేత పూర్ణచంద్రరావుకి సోదరుడు. వీరంతా బలవంతంగా చేశారా లేదో నాకు తెలీదు. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ వీరున్నారని వార్తలొస్తున్నాయి. *ఏపీపీఎస్సీలో అక్రమాలు* డిప్యూటీ కలెక్టర్ల, డీఎస్పీ పోస్టుల కోసం 2018లో ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రశ్నాపత్రాలు మాన్యువల్ మూల్యాంకనం చేయకుండా డిజిటల్ మూల్యాంకనం చేశారు. మాన్యువల్ మూల్యాంకనం చేయాలని కోర్టు ఆదేశాలిస్తే...కోర్టుకు కూడా మాన్యువల్ గా చేశామని తప్పుడు అఫడవిట్ ఇచ్చారు. సొంత మనుషులకు పోస్టులు ఇచ్చుకున్నారు. బాధిత అభ్యర్థులు పోరాడితే న్యాయం జరిగింది. కడప అభ్యర్థి మాధవిరెడ్డి గన్నవరం వస్తుంటే ఆమెపై దాడికి దిగారు. గన్నవరంలో పోస్టర్లు తొలగించకుండా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు పోటో తీయగా పేటీఎం బ్యాచ్ వచ్చి నానా యాగీ చేసింది. మీరేం చేస్తారో చేయండి నేను పోరాడతా అని మాధవి పోరాడింది. ఆ ధైర్యమే అందరిలోనూ రావాలి. బాబాయ్ గొడ్డలి వేటు ఘటనకు ఐదేళ్లు. సీబీఐ ఆఫీసర్ పైనా కేసు పెడితే ఆయన హైకోర్టు కు వచ్చి ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసేందుకు వస్తే శాంతి భద్రతల సమస్య అని చెప్పి అరెస్టు చేయనీకుండా సీబీఐని పంపేశారు. అసలు వైసీపీకి చట్టం వర్తించదా లేక రాష్ట్రంలో చట్టం ఉందాలేదా అన్నది తెలియడం లేదు. *ముస్లింలకు వైసీపీ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది.?* గంజాయి, డ్రగ్స్ లో వేల కోట్లు దోపిడీ...మద్యం, మైన్, శాండ్, సెటిల్ మెంట్లతో 40 ఏళ్లుగా సంపాదించిన ఆస్తులను బెదిరించి లాక్కుంటున్నారు. ఇప్పుడు వైసీపీనే దావూద్ పాత్ర పోషిస్తోంది. బ్యూరోక్రసీని దెబ్బతీయడంతోపాటు ఐఏఎస్, ఐపీఎస్ లను భయపెట్టారు. వైసీపీ నేతలు చెప్పింది చేయకపోతే బదిలీలు లేకుంటే బెదిరింపులు. కొందరు అధికారులు మనసు చంపుకుని పనిచేశారు. పార్లమెంటులో ప్రతి అంశంపై చర్చిస్తున్నారు...కానీ అసెంబ్లీలో ఆ పరిస్థితి లేదు. శాసన సభను కౌరవసభ కాకుండా గౌరవసభగా చేశాకే వస్తానని శపథం చేశాను. ఇసుక దోపిడీపైనా హైకోర్టు రికార్డులు తీసుకురావాలని చెప్తోంది. రికార్డులు ఇవ్వని ఈ దొంగ ప్రభుత్వాన్ని ఏం చేయాలి.? అధికారం, డబ్బు, నేరచరిత్రతో ఏమైనా చేయొచ్చని వారి ఆలోచన. వాలంటీర్లను విచ్చలవిడిగా వాడుతున్నారు. ఈ పోరాటం రాష్ట్ర భవిష్యత్ కోసం చేసే పోరాటం. లోక్ సత్తా మాదిరి అన్ని పార్టీలు ముందుకొచ్చి మనకు మద్ధతు ఇవ్వాలి. సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావాలి. వైసీపీ అభ్యర్థుల లిస్టు చూస్తే..మాటలే చేతలు ఉండవు. ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలకు ఈ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది.? సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయి? డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేశారు. అబ్దుల్ సలామ్ కుటుంబం బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు. రెచ్చగొట్టి రాజకీయం చేసి లబ్ధి పొందే మనస్తత్వం తప్ప సమాజ హితం కోసం వైసీపీ పనిచేయడం లేదు. మనం ఏ స్కీమ్ చూసినా స్కామ్ ఉంటుంది. *160 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం* ఎన్డీయే జాతీయ స్థాయిలో నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుంది. 400కు పైగా స్థానాలతో కేంద్రంలో....160కి పైగా స్థానాలతో ఏపీలో అధికారంలోకి మనం రాబోతున్నాం. 24 ఎంపీలూ గెలవబోతున్నాం...25 ఎంపీలు గెలిస్తే అదొక చరిత్రగా ఉంటుంది. కడప పార్లమెంట్ స్థానాన్ని కూడా మనమే గెలుస్తున్నాం. ఏ మొహం పెట్టుకుని వైసీపీ ఓట్లు అడుగుతుంది. బాబాయ్ ని చంపాం...ఓటేయకుంటే మిమ్మల్నీ లేపేస్తామని అడుగుతారా.? 160 సీట్లు గెలిచేందుకు త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నాం. మళ్లీ ఇక్కడే సమావేశమవుదాం...విజయం దిశగా సమావేశం పెట్టుకుని ఎన్నికలకు వెళ్దాం. ఈ నెల రోజుల పాటు మీరు ఏ మాత్రం ఏమార్చినా ఫోన్లు వస్తాయి. సీట్లు రాని అభ్యర్థులు మూడు పార్టీల్లో ఉన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి రాగానే మంచి అవకాశాలు కల్పిస్తాం.’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले