యూనిఫాం పవర్ ఏమిటో చూస్తారని వార్నింగ్

యూనిఫాం పవర్ ఏమిటో చూస్తారని వార్నింగ్

Share with
Views : 7
దేశం మొత్తం నవ్వుకునేలా పల్నాడు జిల్లా పరువుతీశారని, ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ అన్నారు. ఎన్నికల కౌంటింగ్‌ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు, కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, దేశంలోనే ఆ పేరు వచ్చి ఉండొచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వనని స్పష్టం చేశారు. పోలీసులు ఉన్నా ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయన్నారు.పల్నాడు పేరు చెడగొ ట్టారని, పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతటా ప్రచారమైందని ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. మాచర్ల, నరసరావుపేటల్లో జరిగిన గొడవలతో దేశమంతటా మార్మోగాయని మలికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు.

పల్నాడు జిల్లాలో జరిగిన ఘర్షణలతో ఇక్కడ ఏమి జరుగుతోందని దేశమంతటా గమనిస్తోందని, తన బ్యాచ్‌మేట్స్‌, కుటుంబ సభ్యులు, స్నేహితులు పల్నాడు ఫ్యాక్షన్ గురించే అడుగుతున్నారని రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయన్నారు. బహుశా దేశంలోనే అత్యంత దారుణమైన పరిస్థితులు పల్నాడులో ఉండొచ్చన్నారు. పది రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదు కావడాన్ని ఏ పోలీస్ అధికారి కోరుకోరన్నారు. పల్నాడు తర్వాత స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయని చెప్పారు. ఏ స్థాయిలో పల్నాడులో ఘర్షణలు జరిగాయో అర్థం చేసుకోవాలన్నారు.

ఘర్షణల కేసుల్లో ఇప్పటి వరకు 1300 మందిని అరెస్టు చేశామని, 400 మందిపై రౌడీషీట్లు తెరిచినట్టు ఎస్పీ ప్రకటించారు. పల్నాడు అల్లర్లలో నిందితుల్ని పెట్టేందుకు జైళ్లు సరిపోక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు పంపిస్తున్నట్లు చెప్పారు. గొడవల్లో జైళ్లకు వెళుతున్న వారంతా సామాన్యులేనని, నాయకులు మాత్రం డబ్బు, తెలివి తేటలతో బెయిల్ తెచ్చుకుని బయట తిరుగుతున్నారన్నారు.గొడవల్లో బలవుతున్నది సామాన్య ప్రజలేనని, నాయకుల కోసం మీ జీవితాలు పాడు చేసుకోవద్దని సూచించారు. కౌంటింగ్ రోజు ఎవరైనా తోక జాడిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని, యూనిఫాం పవర్ ఏమిటో చూస్తారని వార్నింగ్ ఇచ్చారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले