ఎస్పీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ వేదవతి

ఎస్పీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ వేదవతి

Share with
Views : 8
అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతురాలని చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి(28)గా గుర్తించారు. ఆత్మహత్యకు భర్తే కారణమని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి జిల్లా ఎస్పీ కార్యాలయంలో సెంట్రీగా విధులు నిర్వర్తిస్తున్న వేదవతి ఆదివారం సెంట్రీ డ్యూటీలో ఉన్నారు. సాయంత్రం ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నా ఆకస్మత్తుగా సెంట్రీ గదిలోకి వెళ్లి తుపాకీతో కాల్చుకోవడంతో తోటి సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం బింగానిపల్లెకు చెందిన వేదవతి 2016లో కానిస్టేబుల్ శిక్షణ కోసం పుంగనూరులోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో చేరింది. కానిస్టేబుల్ పోటీ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంటూ అక్కడ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న మదనపల్లెకు చెందిన దస్తగిరితో ప్రేమలో పడింది. 2016లోనే వీరు పెళ్లి చేసుకున్నారు. 2017లో వేదవతికి కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. దస్తగిరికి అంతకు ముందే వివాహమైంది. వేదవతిని పెళ్లి చేసుకోవడంతో మొదటి భార్య అతడిని విడిచి వెళ్లిపోయింది. వేదవతి చిత్తూరులో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ, ఏడాది క్రితం అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి బదిలీపై వచ్చారు. రాయచోటి పట్టణంలోని రాజీవ్ స్వగృహ కాలనీ సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో భర్తతో కలిసి నివాసం ఉంటున్నారు. దస్తగిరికి మొదటి పెళ్లి ద్వారా ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భార్య వదిలి వెళ్లిపోవడంతో వారి పిల్లలు మదనపల్లెలో నానమ్మ వద్ద ఉంటూ చదువుతున్నారు. వేదవతికి 5ఏళ్ల కుమార్తె ఉంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కుర్చీలో కూర్చుని తుపాకీతో కాల్చుకుంది. తుపాకీ శబ్దం విన్న మరో కానిస్టేబుల్ సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందించారు. సమాచారం తెలియడంతో ఎస్పీ కార్యాలయానికి వచ్చిన భర్త దస్తగిరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయం మెయిన్ గేటు వద్ద ఉన్న గార్డు డ్యూటీ గదిలోనే తన వద్ద ఉన్న గన్‌తో కాల్చుకున్నారు. రాయచోటి పట్టణ సీఐ సుధాకర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె భర్త దస్తగిరి అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొదటి భార్య పిల్లల్ని విడిచి వెళ్లిపోవడం, వారి సంరక్షణ విషయంలో భార్యా భర్తల మధ్య వివాదం తలెత్తినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య చేసుకోడానికి కొంత సమయం ముందు ఆమె ఫోన్‌లో మాట్లాడారని క్షణికావేశంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. వేదవతి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్త వేధింపుల వల్లే వేదవతి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుమార్తెను అనాథను చేసి ఆత్మహత్య చేసుకుందని బోరున విలపించారు. శిక్షణ కోసం వెళ్లిన కుమార్తెను పెళ్లైన సంగతి దాచి పెట్టి మోసం చేశాడని, పెళ్లి తర్వాత వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఘటనా స్థలాన్ని డిఎస్పీ రామచంద్రరావు పరిశీలించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు.
error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले