అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనది : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Share with
Views : 118

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ద్రౌపదిముర్ము మాట్లాడుతూ... ''నేతాజీ పోరాటం వలే అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మహనీయుల చరిత్రను భవిష్యత్‌ తరాలకు భద్రంగా అందించాలి. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారు'' అని రాష్ట్రపతి వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనాన్ని హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర పతి వర్చువల్‌గా ప్రారంభించారు.

అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ''బ్రిటీష్‌ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి. అల్లూరి గొప్పతనాన్ని.. చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలి. అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడని భావిస్తా. మహా కవి శ్రీశ్రీ అల్లూరి గురించి రాసిన 'తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా.. మాలో నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా' సినిమా పాట చాలా పాపులర్‌ అయింది. ఆ పాటను నేను చాలా ఇష్టంగా వినేవాడిని. 26 సంవత్సరాల పిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. భరతజాతి చెప్పుకొనే ఎంతో మంది అమరవీరుల సరసన మేము తక్కువ కాదు అని మన తెలగుజాతిని నిలబెట్టిన గొప్ప మహనీయుడు అల్లూరి'' అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరి ఒక వర్గానికే పరిమితమైన వ్యక్తి కాదన్నారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు విస్మరించలేని క్షత్రియ వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. అల్లూరి వీరుడు మాత్రమే కాదు.. వైద్యుడు, ఆధ్యాత్మిక వేత్త కూడా అని పేర్కొన్నారు. 125వ జయంతి వేళ అల్లూరికి దేశమంతా గర్వంగా నివాళి అర్పిస్తోందని కిషన్‌రెడ్డి అన్నారు.

error: कॉपी नहीं होगा भाई खबर लिखना सिख ले